కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సోనూసూద్ చెల్లెలు

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సోనూసూద్ చెల్లెలు

రియల్ హీరో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన స్వస్థలం పంజాబ్ లోని మోగా నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆమె దిగనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. స్వయంగా సూద్ నివాసానికి వెళ్లి సోనూతో పాటు ఆయన సోదరితో మాట్లాడారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

సోదరి మాళవిక రాజకీయ ప్రవేశంపై గతేడాది నవంబర్లోనే సోనూసూద్ ప్రకటన చేశారు. కానీ ఏ పార్టీలో చేరుతున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సోనూతో భేటీ కావడం ఈ వార్తలకు బలాన్నిచ్చింది. గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాళీదల్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ సైతం మాళవికను కలిసినా చివరకు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.

ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. కరోనా సంక్షోభం సమయంలో సోనూసూద్ ఎంతోమందికి సాయం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించారు. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన లక్షలాది మందిని తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలించి రియల్ హీరో అనిపించుకున్నారు. పేదల పాలిట దేవుడిగా గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో తన సోదరికి తన మద్దతు ఉంటుందని సోనూసూద్ ఇదివరకే ప్రకటించారు. సో ఎన్నికల్లో సోను సోదరి గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.