జేసీ అస్మిత్ రెడ్డిపై దాడిని ఖండించిన అచ్చెన్నాయుడు

టీడీపీ జేసీ అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత మూడు రోజులుగా తాడిపత్రి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో అస్మిత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం నుంచి 3వ వార్డులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక వైస్సార్సీపీ కౌన్సిలర్‌ ఫయాజ్‌ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్దకు రాగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇళ్లపై నుంచి కొందరు అస్మిత్ రెడ్డి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో జేసీ అస్మిత్ తో సహా పలువురు టీడిపి కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

ఈ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జేసీ అస్మిత్ రెడ్డిపై దాడి పిరికిపందల చర్య అని విమర్శించారు. తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డిపై ఒక పథకం ప్రకారం జరిగిన ఈ దాడి వైస్సార్సీపీ ఫ్యాక్షన్ స్వభావాన్ని మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అయిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధికారబలంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని, అధికార బలం సరిపోని పక్షంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఆశ్రయిస్తున్న వైస్సార్సీపీ కి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బెదిరింపులతో, దాడులతో టీడీపీని నిలువరించగలం అనుకోవడం వైస్సార్సీపీ కంటున్న పగటికల మాత్రమేనని విమర్శించారు.