చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలపై ఉన్న కేసులను ఎత్తేస్తాం – మహానాడులో అచ్చెన్నాయుడు హామీ

తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక ప్రారంభమైంది. ఒంగోలు సమీపంలోని త్రోవగుంటలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మహానాడు కార్యక్రమం ఆరంభమైంది. తొలిరోజే వేలాదిగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. టీడీపీ మహానాడులో ఆరంభోపన్యాయం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహానాడు ప్రత్యేకతల్ని వివరించారు. అలాగే వైసీపీ పాలనలో భయపడ్డ కార్యకర్తలకు చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంతో ధైర్యమిచ్చారని అచ్చన్నాయుడు గుర్తుచేశారు. చంద్రబాబు పర్యటనలకు ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలోస్పందన వచ్చిందన్నారు. ఇప్పుడు మనల్ని మూడేళ్లలో కేసులతో ఇబ్బందులు పెట్టారో వారి తాటతీసేలా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క సంతకంతో కేసులన్నీ ఎత్తేస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 160 స్ధానాలతో చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్న మరోసారి జోస్యం చెప్పారు.

గత 40 ఏళ్లలో ఈ మూడేళ్లలో తాము పడిన కష్టం ఎప్పుడూ పడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ స్ధాయి నేతల నుంచి కార్యకర్త వరకూ దుర్మార్గమైన ముఖ్యమంత్రి నుంచి ఇబ్బందులు పడ్డారన్నారు. వైసీపీలా టీడీపీ గాలికి పుట్టిన పార్టీకాదు, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని అచ్చెన్నాయుడు అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆసరా చూపించిన పార్టీ అన్నారు. ఈ పార్టీని లేకుండా చేయడం నీకు, నీ తండ్రికీ, తాతకూ సాధ్యం కాదని సీఎం జగన్ ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.