పెన్షన్ ను రూ. 250 పెంచడం మినహా చేసిందేమీ లేదు

Acham Naidu
Acham Naidu

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజల కోసంచేసింది ఏమీ లేదని టిడిపి ఎమ్మెల్యేఅచ్చెన్నాయుడు విమర్శించారు. తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో 100 రోజుల్లో చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారనే ఆకాంక్షతో జగన్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారని…. ప్రజల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. పెన్షన్ ను రూ. 250 పెంచడం మినహా ఏం చేశారని ప్రశ్నించారు.

ఉద్ధానం ప్రాంతానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని… ఈ ప్రాంతానికి మంచినీరు ఇవ్వడానికి 2017లో టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. తాము పిలిచిన టెండర్లను రద్దు చేసి ఇప్పుడు కొత్త జీవో ఇచ్చారని విమర్శించారు. పలాసలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ కు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పట్లో పనులను ప్రారంభించలేకపోయామని చెప్పారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరం పనుల రివర్స్ టెండరింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా నియమించారని… ప్రజల సొమ్మును వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకు కట్టబెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/