పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో పెను ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలు పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగి పడిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగుమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్ లో పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపోవటంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఐదుగురు కూలీలు బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాద ఘటన పై స్థానిక ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదం ఫై టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 10వ తేదీన పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ పపరిశీలించారు. నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. అయినా.. కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.