ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీః ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పోరేషన్‌ను ఏలుతున్న బిజెపికి ఘోర పరాభవం ఎదురైంది. వరుసగా మూడు పర్యాయాలు మేయర్ పీఠం దక్కించుకున్న బిజెపి.. ఇప్పుడు 97 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది.
ప్రస్తుతం ఆప్ మరో 8 వార్డుల్లో, బిజెపి 6 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు వార్డుల్లో మాత్రమే గెలిచి, మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఢిల్లీ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఆప్‌ను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తమ ప్రభుత్వమే ఉన్నా, ఢిల్లీ కార్పోరేషన్ బిజెపి చేతిలో ఉండటంతో తమకు ఢిల్లీని క్లీన్ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఢిల్లీ ఓటర్లకు వివరించారు. ఎప్పుడైనా ఢిల్లీ పీఠంపై ఒక పార్టీ ఉంటే, ఢిల్లీ మేయర్ పీఠంపై మరో పార్టీ ఉంటూ వస్తున్నాయని, దాంతో సమన్వయం కొరవడి పారిశుద్ధ్యం పడకేస్తున్నదని ఆయన చెప్పారు. ఈసారి పాత సంప్రదాయాన్ని తిరగరాసి ఢిల్లీ మేయర్ పీఠాన్ని కూడా ఆప్‌కే కట్టబెట్టాలని కోరారు. కేజ్రివాల్ కోరినట్టుగానే ఢిల్లీ ఓటర్‌లు ఇప్పుడు ఆప్‌కు అధికారం కట్టబెట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/