పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ఆప్ ప్రభుత్వం

చండీఘఢ్‌ః ఈరోజు పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ ప్రలోభాలకు తెరలేపిందని మంత్రులు ఆరోపిస్తున్న క్రమంలో సీఎం భగవంత్ మాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్, ఆప్ సర్కార్ మధ్య పలు రోజుల పాటు సాగిన సంవాదం అనంతరం సెప్టెంబర్ 27న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జీఎస్టీ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీని ఒకరోజు సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిన మీదట గవర్నర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆమోదం తెలిపారు.
ఇక సెప్టెంబర్ 22న విశ్వాస తీర్మానం చేపట్టేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని అంతకుముందు ఆప్ ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. తమ సర్కార్‌ను కూల్చేందుకు పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఏకంగా రూ 25 కోట్లు ఆఫర్ చేసిందని పాలక పక్షం ఆరోపణలు గుప్పించింది. పంజాబ్ అసెంబ్లీలో 117 మంది సభ్యులుండగా 92 మంది సభ్యులతో ఆప్‌నకు పూర్తి మెజారిటీ ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/