ఏప్రిల్ నుంచి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరంగా యాత్ర

పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆప్
గుజరాత్ ఇప్పుడు ఆప్ ను కోరుకుంటోందని వ్యాఖ్య

cm arvind kejriwal

న్యూఢిల్లీ : తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆప్ ఇప్పుడు గుజరాత్ పై కన్నేసింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో ఎన్నికలు రానున్నాయి. దీంతో గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ఇప్పుడు సన్నాహాలు మొదలు పెట్టింది. ట్విట్టర్ లో ఇందుకు సంబంధించి ఆప్ ఒక ట్వీట్ వేసింది. అందులో.. ‘‘ఢిల్లీ, పంజాబ్ తర్వాత.. ఇప్పుడు గుజరాత్ ఆప్ ను కోరుకుంటోంది’’అని పేర్కొంది.

ట్వీట్ లో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫొటో తో పోస్టర్ కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో గుజరాత్ రాష్ట్రంలో ఆప్ తిరంగా యాత్రను మొదలు పెట్టనుంది. అన్ని మండలాలు, పంచాయతీల పరిధిలో ఇది ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు, పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయనున్న భగవంత్ మాన్ కూడా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/