నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

నల్లగొండ జిల్లాలో ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటన లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. వారిలో ఆరుగురు మరింత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానిక ఎస్‌ఐ ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో వట్టిమర్తి స్టేజి వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.