పావురాలపై హైదరాబాద్ మెట్రో కు పిర్యాదు చేసిన ప్రయాణికుడు

హైదరాబాద్ మెట్రో ఎంతో ప్రత్యేకమైంది. నిత్యం రద్దీ గా ఉండే మెట్రో కు ఓ ప్రయాణికుడు పిర్యాదు చేసాడు. అది కూడా పావురాలపై పిర్యాదు చేయడం వార్తల్లో నిలిచేలా చేసింది. హైదరాబాద్ మెట్రో లో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తున్నారు. తాజాగా నగరంలో మెట్రో రెండోదశ నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద పునాదిరాయి వేశారు.

మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏర్పాట్లు చేస్తున్నది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనున్నది. అవుటర్‌ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు.

ఇంతలా మెట్రో అభివృద్ధి చెందుతుండగా..పావురాలు మాత్రం మెట్రో కు చెడ్డ పేరును తీసుకొస్తున్నాయని ప్రయాణికుడు పిర్యాదు చేసాడు. ఎంజీబీఎస్ స్టేషన్‌లో పావురాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. మెట్రో స్టేషన్ మొత్తాన్ని పావురాలు పాడు చేస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. మెట్లు, ఎస్కలేటర్, ఫ్లాట్ ఫాం.. ఇలా ఎక్కడ చూసినా దుర్గంధంగా ఉంటోందని.. అటు సిబ్బంది కూడా శుభ్రం చేయడం లేదని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు చాలామంది స్పందిస్తున్నారు. పరిష్కారం మార్గం ఏంటో చూపాలని కొందరు అడుగుతుండగా.. ఇలాంటి ఇబ్బంది తాము కూడా ఎదుర్కొన్నామని మరికొందరు చెబుతున్నారు. అటు ఈ ఒక్క స్టేషన్‌లోనే కాదు.. నగరంలోని చాలా స్టేషన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. కొందరు ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపుతున్నారు. మెట్రో స్టేషన్లకు నెట్‌లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. అయితే ఇది సాధ్యం కాదని మరికొంతమంది అంటున్నారు. మొత్తం మీద పావురాల దెబ్బకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.