విద్య.. విలువలకు లోగిళ్లు కావాలి

నూతన జాతీయ విధానంకు అంకరార్పణ అవశ్యం

A new national education policy is essential
A new national education policy is essential

‘ధనం మూలం ఇదం జగత్‌’ అనే నానుడి వాస్తవమై మానవజీవితాలను శాసిస్తున్నది. దుష్టుడైనా, దుర్మార్గుడైనా ధనముంటే దేవుడని కొలుస్తుందీ లోకం.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలై ఒకరికొకరికి సంబంధాలు లేని జీవితాలై మానవత్వాన్నే వెక్కిరిస్తున్నాయి.

విజ్ఞ్ఞానులమ నుకుని విర్రవీగే విద్యావంతులు అజ్ఞాన తిమిరాంధకారంలో అలమటిస్తున్నారు. పట్టాలు ప్రతిభను ప్రసాదించడం లేదు. నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న అపసవ్య ధోరణులకు లోప భూయిష్టమైన విద్యావిధానమే మూలకారణం. తల్లిదండ్రులకు విలునివ్వరు. పెద్దలను ఆదరించరు.

మచ్చుకైనా వివేకం కాన రాదు. ఇవీ నేటి విద్యలు నేర్పుతున్న విలువలు.

ఎద లోతుల్లో పెనవేసుకున్న బంధాల సౌధాలన్నీ తమ కనులముందే పేకమేడల్లా కూలిపోతే, కనికరం కానరాని కఠిన హృదయాలన్నీ వేరే చోట ఆనందంగా సేదతీరుతున్నాయి.

అది ఆనందం కాదని, తాము సేదతీరుతున్నది రక్షించే విహంగపు రెక్కలచాటున కాదని, భక్షించే రాబంధుల రెక్కల మాటున అని గ్రహించేలోపు జీవితం తెల్లారిపోతుంది.

ఉడుకురక్తం చల్లారిపోతుంది. నడవా లంటే నీరసం, మాట్లాడాలంటే ఆయాసం అవహించి తమ స్థితులు గతులు తప్పిననాడు గతాన్ని వెనక్కి తీసుకురాక, వర్తమానంలో బతకలేక భవిష్యత్తే బరువై గమ్యంకానరాని మార్గాలకు పయనమైతే అది ఆరాటమే తప్ప ఫలితం శూన్యం.

తల్లిదండ్రుల సంపాదన కావాలి. వారి యోగక్షేమాలను చూడడం వారి బాధ్యత కాదు.

నలుగురితో వారిని పరిచయం చేయడం నామోషి, అవమానకరం. వారి సంపాదనతో నిస్సిగ్గుగా జల్సాలు చేసి పరాన్న జీవ్ఞలుగా బతకడంలో లేని అవమానం మిగిలిన విషయాల్లో కానరావడం దౌర్భాగ్యం.

చదువు రాకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయ అనే సామెతను తలపిస్తూ చదవేస్తే ఉన్న మతిపోయినట్టు ప్రవర్తించే ప్రబుద్ధుల వక్రబుద్ధులు వర్ణింపశక్యంకాదు.

ఇలాంటి అనుచిత ధోరణులన్నీ చదువ్ఞకొన్న ‘విద్యాధిక యువతలో అడుగడుగునా కానవస్తున్నాయి. నేటి మన విద్యావిధానంలో చోటుచేసుకుం టున్న విపరీత ధోరణులే యువతలో తలెత్తే ఉన్మాద చేష్టలకు పరాకాష్ట.

చదువుకున్న వారు మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటే చదువులేని వారు జ్ఞానుల్లా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో మన చదువులకున్న విలువేమిటి? తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించని విద్యలు బూడిదలో పోసిన పన్నీరే.

అయినా చదువులు అంగడిలో అమ్ముడుపోయే సరుకుల్లా తయారైనాయి. చదువ్ఞ ‘కొంటే చాలు చదవనక్కర్లేదు.

‘లేనోడికి దొరకనప్పుడు ఉన్నోడికి అరిగినప్పుడే ఆకలి’ అన్నట్టుగా అప్పుడప్పుడూ వచ్చిపోయే అతిథుల్లా మేమూ విద్యార్థులమేనంటూ తళుక్కన మెరిసి చట్టు క్కున్న మాయమైతే చాలు.

పట్టా చేతికొస్తుంది. పట్టాలులేని రైతు సమాజంలోకి దూసుకువచ్చి మేథావుల్లా చెలామణి కావచ్చు.

జనాలను ప్రమాదంలోకి నెట్టేయవచ్చు. డిగ్రీలు బడాయిని పెంచుతున్నాయి. అర్థంలేని భావాలను అపహాస్యంగా వ్యతిరేకిస్తున్నాయి. నైతిక విలువలను చంపేస్తున్నాయి. తల్లిదండ్రుల పెంపకం కూడా సరిగా లేకపోవడం వలన ఎదిగిన పిల్లలు ఎదురుతిరుగుతున్నారు.

తామేదో జ్ఞానులమైపోయామని పనికిరాని డిగ్రీలతో, చరవాణి చేతధరించి బడాయిపోతున్నారు.

తల్లిదండ్రులకు కూడా నాలుగు ఆంగ్లపదాలను వాడి,ఫ్యాషన్లలో విహరించే పిల్లలను చూసి మురిసిపోతున్నారే గాని వారిని మూర్ఖులుగా, సమాజానికి చీడపురుగుల్లా పరాన్న జీవులుగా తయారు చేస్తున్నామని గమనించలేకపోతున్నారు.

సర్వం సమ కూర్చిపెట్టి అహర్నిశలూ కష్టించి సర్వస్వం ధారబోసి చదువును కొనిపెట్టి, సమాజానికి గుదిబండల్లా, సోమరుల్లా తయారు చేస్తున్నవారు తల్లిదండ్రులే అనిచెప్పకతప్పదు.

తాము తినకుండా తమ బిడ్డల కోసం సర్వస్వం తాగ్యం చేస్తే తల్లిదండ్రుల సంపా దనతో సకల భోగాలను అనుభవిస్తూ కన్నవారినే భారంగా అవమానంగా భావిస్తూ వృద్ధాశ్రమాల్లోకి గెంటేసి, మానవత్వాన్నే మంట గలుపుతున్న సజీవ దృశ్యాలెన్నో మనకళ్లెదుట కాన వస్తున్నాయి.

బడాయి చదువులతో భద్రంగా బతికేస్తున్నామనే భ్రమలో బద్దకస్తులుగా తయారవ్ఞతున్న యువతధోరణి అత్యంత ప్రమాదకరం.

తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్న ట్టుగా విద్యాలయాలన్నీ విద్యార్థుల ఆలోచనలకే అందని అత్యు త్తమ ఫలితాలనిచ్చేసి పట్టభద్రులుగా సమాజంలోకి వదిలేస్తే వారు పట్టభద్రులుగా కాక ఉత్తభద్రులుగా తయారై విద్య అనే పదానికే ద్రోహం చేస్తున్నారు.

ఈ దేశంలో పుట్టి, ఈ దేశాన్నే అవమానిస్తున్నారు. విద్యావిహీనుల కంటే విద్యావంతుల వలనే సమాజానికి హానికలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

దీనికంత టికి కారణం మన విద్యావ్యవస్థలో పేరుకుపోయిన లోపభూయి ష్టమైన విధా నాలే. నూతన జాతీయ విద్యావిధానంలో ఇలాంటి అపసవ్యమైన పోకడలకు చోటివ్వకుండా చూడాలి.

విద్యార్థులకు విలువల ఆధారిత పాఠ్యాంశాలు రూపొందించాలి.

పట్టాలను ప్రదానం చేయడంలో తగిన మార్గనిర్దేశకాలు ప్రవేశపెట్టాలి. దేశభక్తి విజ్ఞ్ఞానం వినయం, వివేకం రంగరించిన విద్యలకు నూతన జాతీయ విద్యావిధానం అంకురార్పణ గావించాలి.

  • ఎస్‌. సత్తిరాజు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/