మూసీకి తగ్గిన వరద… ఊపిరి పీల్చుకున్న బస్తీ వాసులు

మూసి నది శాంతించింది. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో భారీగా వరద నీరు మూసీ నదిలోకి వచ్చి చేరుతుండడంతో.. మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్‌ వంతెన పైనుంచి మూసీ ప్రవహించింది.

ప్రస్తుతం మూసీ నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి వరద తగ్గడంతో పరివాహక ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. నిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవాహం పొంగి ప్రవహించింది. దీంతో బ్రిడ్జిపై భారీగా బురద, చెత్త, రాళ్లు పేరుకుపోయింది. చెత్త చెదారం తొలగింపులో జీహెచ్ఎంసీ నిమగ్నమైంది. ఈక్రమంలో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. వరదలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో విద్యుత్‌, నీటి సరఫరా నిల్చిపోయింది. శంకర్‌నగర్‌, మూసానగర్‌ బస్తీల్లోకి వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. బుధవారం సాయంత్రం వరద తాకిడికి గురైన ఇళ్లకు ఉన్న విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా తొలగించి మిగతా ఇళ్లకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.