మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ..

ఏపీలో రాజధాని అంశం రోజు రోజుకు ఉదృతం అవుతున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా తేల్చాలని అమరావతి రైతులు , టీడీపీ , బిజెపి , జనసేన పార్టీ లు పట్టుబడుతుంటే..వైస్సార్సీపీ మాత్రం మూడు రాజధనలకు మద్దతు తెలుపుతుంది. దీంతో అటు అమరావతి ప్రజలు , ఇటు వైస్సార్సీపీ తో పాటు మూడు ప్రాంతాల ప్రజలు భారీ ర్యాలీ లు , ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీ చేపట్టిన వైస్సార్సీపీ..నేడు తిరుపతి లో వైస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పెద్ద ఎత్తున విద్యార్థులు,యువకులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని నినదించారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన చేపట్టడంతో తిరుపతినగరం జనసంద్రంగా మారింది. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన.. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా నగర పాలక సంస్థ కార్యాలయం వరకు వేలాదిమందితో కొనసాగింది. తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ ఉద్ఘాటించారు.