రైతు కూలీగా మారిన బిజెపి మాజీ ఎమ్మెల్యే

ఉప్పల్ మాజీ బిజెపి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్..రైతు కూలీగా మారారు. కీసరలోని తన వ్యవసాయక్షేత్రంలో కొడవలి చేతపట్టి వరి కోత కోశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని .. దేశానికి వెన్నుముక ఆయిన రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్బంగా తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించటం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని చెప్పారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను మోడీ ప్రభుత్వం సబ్బిడీతో అందిస్తుందన్నారు. పెట్టుబడి కోసం పీఎం కిసాన్ యోజన, పండిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కోనుగోలు కేంద్రాలు, ఈ మార్కెటింగ్ విధానులు తీసుకొచ్చామన్నారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రధాని మోడీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని ట్వీటర్ వేదికగా ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

ప్రభాకర్ రాజకీయ విషయానికి వస్తే.. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌ రెడ్డి పై 14169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌ రెడ్డి పై 48168 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.