నాదెండ్ల మనోహర్ కు చేదు అనుభవం

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సోమవారం ఇప్పటం లో ఓ చేదు అనుభవం ఎదురైంది. జనసేన ఆవిర్భావ సభ కోసం స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులతో సోమవారం మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వాసులతో నాదెండ్ల మాట్లాడుతుండగానే… విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జనసైనికులు తమ సెల్ ఫోన్లలో టార్చ్ లను ఆన్ చేశారు. ఈ సెల్ ఫోన్ల లైటింగ్ లోనే నాదెండ్ల తన సమావేశాన్ని కొనసాగించారు. నాదెండ్ల మనోహర్ ప్రసంగం ముగిసిన మరుక్షణమే గ్రామంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడం గమనార్హం. ఇలాంటివి కరెంట్ కటింగ్ లు జనసేన పార్టీ కి కొత్తమీ కాదు. ఈ మధ్యనే పవన్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయన ర్యాలీ గా వస్తున్న క్రమంలో కరెంట్ కట్ అయ్యింది. ఈ క్రమంలో అభిమానులు సెల్ ఫోన్లలో టార్చ్లు ఆన్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించారు.

ఇదిలా ఉంటె ఇప్పటం లో మనోహర్ మాట్లాడుతూ..ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్థులు తమ భూమిని ఇస్తే… దానికి ప్రతిగా గ్రామానికి పవన్ రూ.50 లక్షల విరాళం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను సీఆర్డీఏ ఖాతాలో జమ చేయమని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా పవన్ నిధులతో గ్రామంలో ఓ కమ్యూనిటీ హాల్ ను నిర్మించి దానికి వైఎస్సార్ పేరు పెడతామని అధికారులు చెప్పడం మరింత విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.