ఉత్తర ప్రదేశ్ లో విషాదం : ఇంటి గోడ కూలి తొమ్మిది మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ దిల్​కుషా​ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడం వల్లే గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఆ గోడ పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న తొమ్మిది మంది మృతి చెందారని తెలిపారు.

ఈ ఘటన పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ప్రమాదం జరగడం విచారకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.