మాల్దీవులలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

మృతుల్లో 9 మంది భారతీయులేనని వెల్లడి

9-indians-killed-in-maldives-fire

మాల్దీవ్స్‌: మాల్దీవులలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో పదిమంది సజీవ దహనమయ్యారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు పది మృతదేహాలను గుర్తించి, వెలికి తీసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. అందులో తొమ్మిది భారతీయుల మృతదేహాలేనని వివరించారు. మిగిలిన ఆ ఒక్కటి బంగ్లాదేశ్ పౌరుడికి చెందినదని వివరించారు. కాగా, మలేలో వలస కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారు. మన దేశంతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకల నుంచి అక్కడికి వలసలు ఎక్కువగా ఉంటాయి.

రాజధాని మలే లోని ఓ బిల్డింగ్ అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యిందని అధికారులు చెప్పారు. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాహనాల రిపేర్ సెంటర్ ఉండగా.. పైన ఉన్న చిన్న చిన్న గదుల్లో చాలామంది వలస జీవులు ఉంటున్నారని వివరించారు. బిల్డింగ్ లో ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి తమకు నాలుగు గంటలు పట్టిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. కాగా, అగ్ని ప్రమాద ఘటనపై మాల్దీవులలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాదం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మాల్దీవుల అధికారులతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి సంబంధించి సాయం కోసం తమను సంప్రదించవచ్చని ట్వీట్ చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/