కోల్‌కతా అగ్నిప్రమాదం..ప్రధాని సంతాపం

తొమ్మిదికి పెరిగిన మృతులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిన్న సంభవించిన అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పోలీసు ఏఎస్ఐ ఉన్నట్టు పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక, అత్యవసర సేవల మంత్రి సుజీత్ బోస్ తెలిపారు. కోల్‌కతాలోని స్ట్రాండ్ రోడ్డులో ఉన్న కోయిలఘాట్ బిల్డింగ్‌లోని 17వ అంతస్తులో ప్రమాదం సంభవించింది. ఇందులో రైల్వే కార్యాలయాలు ఉన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కోల్‌కతా కమిషనర్ సౌమెన్ మిత్రా, మంత్రి సుజీత్ బోస్, జాయింట్ సీపీ (క్రైమ్) మురళీధర్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. గత రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీ పరిస్థితిని చూసి బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

సాయంత్రం వరకు భవనంలో మంటలు ఎగసిపడుతుండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో తూర్పు జోన్‌లో కంప్యూటరైజ్‌డ్ టికెట్ బుకింగ్‌కు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 6.10 గంటలకే తమకు సమాచారం వచ్చిందని, 10 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఫైర్ బ్రిగేడ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. భవనంలోని 13 అంతస్తే మంటలు చెలరేగడానికి కారణమని తెలుస్తున్నా, ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

కాగా, అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ నిధి నుంచి రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/