9 మంది ఆల్‌ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

NIA Arrested 9 Al-Qaeda Terrorists In Multiple Raids

ఎర్నాకుళం: ఆల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 9 మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ అరెస్టుల‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉన్న‌ది. ప్రాథ‌మిక విచార‌ణ ప్ర‌కారం.. పాకిస్థాన్‌కు చెందిన ఆల్ ఖ‌యిదా ఉగ్ర‌వాదులు సోష‌ల్ మీడియా ద్వారా భార‌త్‌లోని వారిని ప్రేరేపించిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాడుల‌కు పాల్ప‌డే విధంగా రెచ్చ‌గొట్టిన‌ట్లు ద‌ర్యాప్తు ద్వారా భావిస్తున్నారు. ఆల్ ఖ‌యిదా మ‌ద్ద‌తుదారులు నిధుల స‌మీక‌ర‌ణ కోసం విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు కొనేందుకు కొంద‌రు ఢిల్లీకి కూడా వెళ్లేందుకు ప్లాన్ వేసిన‌ట్లు తేలింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/