కరోనా అప్‌డేట్.. లక్షకు చేరువలో కొత్త కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమై రోజులు గడుస్తుండటంతో పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో ఏకంగా 81466 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు భారత్‌లో ఏకంగా 1,23,03,131 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 1,15,25,039 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,14,696 పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 469 మంది కరోనా మహమ్మారికి బలయ్యారని, దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,63,396కి చేరుకుందని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. సామాజిక దూరంతో పాటు బయటకు వెళ్తే మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందిగా పలు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.