80 డ‌బుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభించిన మంత్రులు

double-bedroom-houses

మహబూబ్‌నగర్‌: మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి భూత్పూర్ మండ‌లం అన్నాసాగ‌ర్‌లో రూ. 428.20 కోట్ల‌తో నిర్మించిన 80 డబుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించారు. మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో 1500 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్ నాయ‌కులు పేద‌ల నుంచి డ‌బ్బులు దోచుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కానీ టిఆర్ఎస్ ప్ర‌భుత్వం పేద‌ల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తుంద‌న్నారు. రాష్ర్టంలోని ప్ర‌తి నిరుపేద‌కు ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అందాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఉద్ఘాటించారు. పోలవ‌రం ప్రాజెక్టుకు నిధులిస్తున్నా కేంద్రం.. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌ను ప్ర‌శ్నించారు. రాష్ర్టానికి నిధులు వ‌చ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని బిజెపి నేత‌ల‌కు మంత్రి వేముల సూచించారు.

అనంత‌రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పేద‌ల గురించి ఆలోచించే ఏకైక ప్ర‌భుత్వం టిఆర్‌ఎస్‌ ప్ర‌భుత్వం మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రికి సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయ‌ని తెలిపారు. రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కం ద్వారా పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహాల‌కు ఆర్థిక చేయూత‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. ఒక‌ప్పుడు ఇత‌ర రాష్ర్టాల నుంచి బియ్యం దిగుమ‌తి చేసుకునే వాళ్లం.. ఇప్పుడు 60 శాతం బియ్యాన్ని తెలంగాణ నుంచి ఇత‌ర రాష్ర్టాల‌కు ఎగుమ‌తి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/