ఏపీ శాసనమండలి నుండి 8 మంది టీడీపీ ఎమ్మెల్సీల సస్పెన్షన్

మద్య నిషేధంపై టీడీపీ సభ్యుల రచ్చ

అమరావతి : ఏపీ శాసనమండలి నుంచి 8 మంది టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. ‘మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా’ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు మండలి వరకు ర్యాలీ చేశారు. మృతుల ఫొటోలకు నివాళులు అర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. కల్తీ సారా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మండలిలో డిమాండ్ చేశారు.

విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు మండలిలో రచ్చ చేశారు. దీంతో వారిపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో దిగజారిపోతారని ఊహించలేదని అన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ బిచ్చగాళ్లగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో 8 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కేఈ ప్రభాకర్, మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అంగర రామ్మోహన్ రావు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, దువ్వాడ రామారావు, బచ్చుల అర్జునుడు, రాజ నర్సింహులు ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/