ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ ఒకదానికి ఒకటి ఢీ కొట్టడం తో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో దౌరెహ్రా నుంచి లక్నోకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఎలా బ్రిడ్జికి సమీపంలో ఇసానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద ఘటన తెలియగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
“లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సంతాపం తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారికి చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని యోగి సీనియర్ అధికారులను ఆదేశించారు” అని సీఎంఓ (CMO) ట్వీట్ చేసింది.