ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడులు..8 మంది మృతి.. 24 మందికి గాయాలు

కివ్‌ః ఉక్రెయిన్‌పై ఈరోజు రష్యా విరుచుకుపడింది. రష్యా ప్రయోగించిన క్షిపణుల కారణంగా కీవ్‌లో పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. కీవ్‌లోని షెవ్చెంకో ప్రాంతంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో వెల్లడించారు. షెవ్చెంకో ప్రాంతం కీవ్ నగరం మధ్యలో ఉంటుంది. ఇది చారిత్రక పాత నగరం. అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పేలుళ్ల కారణంగా 8 మంది మృతి చెందారని, 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్ నేషనల్ యూనివర్శిటీ ప్రధాన భవనానికి సమీపంలో ఒక పేలుడు సంభవించింది.
నాలుగు నెలల విరామం తర్వాత కీవ్‌పై రష్యా దాడులకు దిగడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌లోని ఇతర నగరాలపై కూడా రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న లివివ్ నగరంలో కీలక మౌలిక సదుపాయాలపై రష్యా రాకెట్లు సంధించింది. భారీ విధ్వంసాన్ని సృష్టించింది.గత కొద్దిరోజులుగా క్రిమియాకు ఉత్తర ప్రాంతం, జపోరిజియాలోనే రష్యా-ఉక్రెయిన్ సేనల మధ్య భీకర పోరు జరుగుతోంది. జపోరిజియాపై రష్యా ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ మాత్రం గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉంది. ఇటీవల రష్యా-క్రిమియాను కలిపే ప్రధాన వంతెనపై జరిగిన పేలుడు యుద్ధ తీవ్రతను పెంచింది. ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడి వెనక ఉక్రెయిన్ ప్రత్యేక దళాల హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా దర్యాప్తు ప్రారంభించినట్లు పుతిన్ తెలిపారు. అందుకు ప్రతీకారంగానే నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/