8 బంగారు ప‌త‌కాలు సాధించిన సూర్యాపేట వైద్య విద్యార్ధిని

doctor
doctor

సూర్యాపేటః మెడిసిన్‌ విద్యలో సూర్యాపేటకు చెందిన వైద్య విద్యార్థిని సత్తా చాటారు. మెడిసిన్‌ చివరి సంవత్సరంలో అద్భుత ప్రదర్శనకు గాను మతకాల అపర్ణ 8 బంగారు పతకాలు సాధించారు. మంగళవారం ఆగ్రాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి కోవింద్‌ చేతుల మీదుగా ఆమె బంగారు పతకాలు అందుకున్నారు. సర్జరీ, మెడిసిన్‌ విభాగాల్లో ఈ పతకాలు వచ్చాయి. ఒకేసారి ఇన్ని పతకాలు రావడం దేశ చరిత్రలోనే రికార్డుగా పేర్కొంటున్నారు. కేవలం అపర్ణను అభినందించడానికే రాష్ట్రపతి వర్సిటీకి విచ్చేశారు.
ఒకే కోర్సులో 8 బంగారు పతకాలు సాధించడంపై యూపీ గవర్నర్‌ రాంనాయక్‌, ఉప ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ ఆమెను అభినందించారు. సూర్యాపేటలో భవాని నర్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తున్న మతకాల చలపతిరావు కుమార్తె ఈమె. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాలలో హౌస్‌సర్జన్‌ చేస్తున్నారు.