మునుగోడు లో సా 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ మధ్యాహ్నం తరువాత ఊపందుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు గంట సమయమే ఉండడంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చండూరులో టిఆర్ఎస్ , బిజెపి కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నాన్ లోకల్ వాళ్లు డబ్బులు పంచుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.

దీంతో రెండుపార్టీల మధ్య వాగ్వాదం మొదలైంది. పోలీసులు ఎంటరై లాఠీచార్జ్ చేశారు. విషయం తెలసుకున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పాట్ కు చేరుకున్నారు. నాన్ లోకల్స్ వాళ్లను పట్టుకుని పట్టించినా.. పోలీసులు వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. డబ్బులు పంచుతున్నా కూడా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు.