నేటితో రాజ్యాంగానికి 70 ఏళ్లు

Constitution Day 2019
Constitution Day 2019

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగానికి నేటితో 70 ఏళ్లు పూర్తికానున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఏడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 26 నవంబరు 1949న రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు పార్లమెంటులో వేడుకలు నిర్వహించనున్నారు. సెంట్రల్‌హాల్‌లో జరిగే ఉభయసభల చారిత్రక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. కాగా, రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏడాదిపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో రాజ్యాంగం పీఠిక చదవడంతో ఈ రాజ్యాంగ 70 వ వార్షిక దినోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ జాతీయ స్థాయి అవగాహన ఉద్యమం నవంబర్ 26న ప్రారంభమై 2020 నవంబర్ 26 వరకు సాగుతుంది. జమ్ముకశ్మీర్ లోని సివిల్ సెక్రటేరియట్‌లో ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠికను చదువుతారు. ఆర్టికల్ 370 రద్దయిన తరువాత మొట్టమొదటి సారి ఇక్కడ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాల అధిపతులు, తమ కార్యాలయాల్లో ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠికను చదువుతారు. ప్రాథమిక విధులను ప్రత్యేకించి ప్రస్తావిస్తారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/