భారత్ లో 21 కి చేరిన ఓమిక్రాన్ కేసులు..

ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు వెలుగులోకి రాగా..ఇప్పుడు భారత్ లో కూడా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు ఆదివారం సాయంత్రానికి ఇండియాలో ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 21కు చేరింది. కొత్తగా రాజస్థాన్‌లో ఇవాళ 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు వచ్చిన వారికి ఈ వేరియంట్ సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ అని తేలిందని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు సంఖ్య 21కి పెరిగింది. మహారాష్ట్రలో కొత్తగా వచ్చిన 7 కేసుల్లో 6 కేసులు పింప్రి- చించ్వాడాలో.. ఒక కేసు పుణేలో .. అంతకు ముందు నమోదైన మరొక కేసు ముంబైలో నమోదైంది. వీరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల శాంపిళ్లను ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్స్ కు పంపారు.
ఇక బ్రిటన్ లో ఓమిక్రాన్ వేరియంట్ అక్కడి ప్రజలను నిద్ర పోనివ్వడం లేదు. ఇప్పటి వరకు బ్రిటన్ లో 160 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ఓమిక్రాన్ వేరియంట్ ను అడ్డు కోవడానికి తీవ్రం గా ప్రయత్నిస్తుంది. అందులో భాగం గా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. బ్రిటన్ కు వచ్చే ప్రతి ప్రయాణికుడు తప్పక ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా అంతర్జాతీయ ప్రయాణికుల పై ఏకం గా నిషేధం విధించింది.