ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

7 Dead In Major Fire At Delhi’s Gokalpuri, 60 Huts Burnt

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. 60కిపైగా గుడిసెలు తగలబడ్డాయి. ఈ ఘటన ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మొత్తం 13 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. “ఉదయం తెల్లవారుజామున విచారకరమైన వార్త విన్నాను. నేను సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తాను” అని ఆయన హిందీలో ఒక ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/