ఆరో రోజుకు చేరిన బాసర విద్యార్థుల ఆందోళన

బాసర విద్యార్థుల ఆందోళన ఆరొవ రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెపుతున్నారు. ఎండ, వానని సైతం లెక్కచేయకుండా తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ ఏవోపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆందోళన నేపథ్యంలో నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. అయితే చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొనగా, చర్చలు విఫలం అయ్యాయని విద్యార్థులు అంటున్నారు.

ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2018 నుండి తమ డిమాండ్లను ప్రభుత్వం నాన్చుతూ వస్తుందని విద్యార్థులు ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు విద్యార్థులు. కాగా, సోమవారం నుండి విద్యార్థులు క్లాసులకు వెళ్తారని మంత్రి వెల్లడించగా.. విద్యార్థులు మాత్రం ఆందోళన కొనసాగుతోందంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం ఏర్పడింది.