సూర్యాపేట ర్యాంగింగ్ కేసులో ఆరుగురు విద్యార్థులు సస్పెండ్‌

సూర్యాపేట ర్యాగింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డిఎంఈ రమేష్ రెడ్డి. హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లి ప్రాంతానికి చెందిన సాయికుమార్…సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 1న కొందరు సీనియర్ విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ మద్యం సేవించారు. సాయికుమార్‌ను తమ గదికి రావాలని పిలిచారు. సీనియర్ల గదికి వెళ్లిన విద్యార్థి సాయికుమార్ పట్ల సీనియర్లు అనుచితంగా ప్రవర్తించారు.

బయోడేటా చెప్పాలని, దుస్తులు విప్పించి ఇబ్బందులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సీనియర్ల నుంచి తప్పించుకున్న విద్యార్థి తన తండ్రికి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. వెంటనే అతడు 100కు ఫోన్ చేయడంతో పట్టణ పోలీసులు హాస్టల్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థులను ఒక్కొక్కరిగా ప్రశ్నించి వారిపై కేసులు నమోదు చేసారు. ఈ ఘటనకు పాల్పడిన 2019-20 బ్యాచ్ కి చెందిన జె మహేందర్, జి శశాంక్ , పి శ్రవణ్, ఏ. రంజిత్ సాయి, కె హరీష్, బి సుజిత్ లను ఏడాది పాటు సస్పెండ్ చేసిన డిఎంఈ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.