50 శాతం రాయితీతో వరి యంత్రాలు

Paddy cutter Machine
Paddy cutter Machine

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 50 శాతం సబ్సిడీపై వానాకాలం సీజను నుండి వరి యంత్రాలను రైతులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వ్యవసాయ రంగంలో యంత్రీకరణ వైపు దృష్టిసారించిన ప్రభుత్వం అందుకు సబ్సిడీపై వాటిని సరఫరా చేసేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే వానాకాలం సీజనులో రాష్ట్రంలో ప్రధానంగా వరి నాటు యంత్రాలకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా వాటిని రైతులకు సరఫరా చేయనుంది. వరి సాగు జరిగే ప్రాంతాల్లో సబ్సిడీపై వరి నాటు యంత్రాలను పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 50 శాతం సబ్సిడీపై వరి నాటు యంత్రాల సరఫరా ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించినట్లు వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రణాళికలో ఈ ప్యాకేజీ కొనసాగుతోంది. అయితే మొదటి నుండి సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకే ప్రాధాన్యమిచ్చిన వ్యవసాయ శాఖ ఈ ప్యాకేజీని గూర్చి పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, హర్యానా తదితర రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి నాటు యంత్రాలను వాడుతున్నా తెలంగాణ రాష్ట్రంలో నామమాత్రంగానే ఉంది. అయితే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు పూర్తయి, ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో వరి సాగు పెరింది. ప్రస్తు యాసంగి సీజనులో సైతం వరి సాగు రాష్ట్రంలో పెరిగింది. దీంతో నాట్లు వేయడానికి కూలీల కొరత ఏర్పడింది. దీంతో పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ నుండి సైతం తెలంగాణకు కూలీలను తీసుకొచ్చి యాసంగి సీజనులో వినియోగించారు. ఉపాధి హామీ పథకం అమలుతోపాటు, వ్యవసాయ పనుల పట్ల ఆసక్తి చూ పని కూలీలు ఇతర వృత్తుల్లో ఉపాధిని చూసుకుంటుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వానాకాలం, యాసంగి సీజన్లలో కూలీల కొరత ఎక్కువైంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో వరి సాగు జరిగే ప్రాంతాల్లో వరి నాటు యంత్రాల కోసం రైతులు ఆసక్తి కనపరుస్తుండడంతో వాటికి డిమాండ్‌ పెరుగుతోంది. కాగా క్షేత్ర స్థాయిలో కూలీల కొరతను అధికమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా సాటునీటి ప్రాజెక్టులు పూర్తి అయితే వాటి పరిధిలోని ఆయకట్టు పెరిగిన కొద్దీ వ్యవసాయంలో కూలీల సమస్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వరి నాటు యంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.