కరాచీ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..9 మంది మృతి

పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి చొరబడిన 8 మంది ఉగ్రవాదులు

5 Pakistani Taliban militants among 9 killed in Karachi police station attack

కరాచీః పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ (పాకిస్థాన్) ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సందర్భంగా భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, ఓ పౌరుడు, రేంజర్ సిబ్బంది ఉన్నారు. అలాగే, 17 మంది గాయపడ్డారు.

కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న ఈ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి 8 మంది ఉగ్రవాదులు చొరబడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా, మరో ఇద్దరు తమనుతాము పేల్చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు పేల్చేసుకోవడంతో భవనంలోని కొంతభాగం దెబ్బతింది. శక్తిమంతమైన పేలుడు కారణంగా సమీపంలోని భవనాల కిటికీ అద్దాలు ఎగిరి అవతల పడ్డాయి. పోలీసు భవనంలో కాల్పులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పోలీసు భవనం పోలీసుల నియంత్రణలోనే ఉందని, ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారని సింధ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముర్తాజా వాహబ్ తెలిపారు. ఉగ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్లు, ఆటోమెటిక్ గన్స్ ఉపయోగించినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఉగ్రవాదులు రెండు కార్లలో సాయంత్రం 7.10 గంటలకు వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి, డీఐజీ ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు.