వరంగల్ నిట్‌ లో కరోనా కల్లోలం

కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతుంది. ఈ రాష్ట్రం..ఆ రాష్ట్రం అనే తేడాలు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా తో పాటు ఓమిక్రాన్ వైరస్ ఉదృతి కొనసాగుతుంది. దీంతో పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను మొదలుపెట్టాయి. రాత్రి కర్ఫ్యూ , వీకెండ్ లాక్ డౌన్ వంటివి చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా వరంగల్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో కరోనా కలకలం రేపింది.

నిట్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులు, మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.. దీంతో అప్రమత్తమైన నిట్‌ అధికారులు.. ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన.. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఇక, నిట్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు పలు తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్వీ రమణారావు వెల్లడించారు.

ఇక గడచిన 24 గంటల్లో తెలంగాణ లో 54,534 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,913 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,214 మందికి పాజిటివ్ అని తేలింది. రంగారెడ్డి జిల్లాలో 213, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 161 కేసులు గుర్తించారు. అదే సమయంలో 232 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు.