5రోజులు అడవిలో గడపడం హాయిగా అనిపించేది

modi
modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను గుర్తు తెచ్చుకున్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి కొన్ని విషయాలు తెలిపారు. ప్రతి దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయేవాడినని, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడినని చెప్పారు. దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడినని, సరిపడా ఆహారం తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపేవాడిన్నారు. అది తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. అప్పట్లో టీవీ, ఇంటర్నెట్‌ లేవని చెప్పారు. బిజీ జీవితాలకు దూరంగా అలా గడపడం చాలా హాయిగా అనిపించేదని చెప్పారు.  రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందని మోడి యువతకు సలహా ఇచ్చారు. పదిహేడేళ్ల వయసులో రెండు సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్లినట్లు తెలిపారు. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత ఇతరులకు సేవ చేసేందుకు నా జీవితాన్ని ఉపయోగించాలనుకున్నాను. ఆ తర్వాత అహ్మదాబాద్‌ వెళ్లాను. పెద్ద నగరంలో జీవించడం అప్పుడే తొలిసారి. అక్కడ అప్పుడప్పుడూ మా అంకుల్‌కు క్యాంటీన్‌లో సాయం చేసేవాడిని.  ఇతరులతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం శుభ్రం చేసేవాడిని, టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి అన్ని పనులు చేసేవాడిని. హడావుడి జీవితంలో పడిపోయి హిమాలయాలకు వెళ్లినప్పుడు కలిగిన ప్రశాంతతను కోల్పోకూడదని భావించాను, అందుకే ఎవ్వరికీ తెలియకుండా 5 రోజులు అడవికి వెళ్లి వచ్చేవాడిని. ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని కొందరు అడిగేవారు.. నన్ను నేను కలిసేందుకు వెళ్తున్నానుగ అని చెప్పేవాడిని అని మోడి వెల్లడించారు.