ఈరోజు నుంచి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన నేటి నుండి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు చండీగఢ్‌లో ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో సమావేశాలు కొనసాగునున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. పలు వస్తువుల పన్ను రేట్లలో మార్పులతో పాటు రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్‌ నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నది. బీజేపీయేతర రాష్ట్రాలు రెవెన్యూ లోటు భర్తీని కొనసాగించాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.
అయితే, కేంద్రం ఆర్థిక పరిస్థితిని పేర్కొంటూ దాన్ని నిలిపివేయాలని భావిస్తున్నది. సెస్‌ వసూళ్లలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్ట పరిహార లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు రుణం తీసుకుంది. లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ సమావేశంలో రెవెన్యూ లోటుకు రాష్ట్రాలకు పరిహారం ఇచ్చే విధానం జూన్ 2022లో ముగుస్తుందని సీతారామన్ ప్రకటించారు. ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించిన పన్ను రేట్లను కూడా సమావేశంలో పరిశీలించనున్నారు.

కృత్రిమ అవయవాలు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్‌పై, రోప్‌వే పై 5శాతం జీఎస్టీ విధించాలని కమిటీ సిఫారసు చేసింది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన నివేదికపై రేసింగ్ చర్చ జరుగనున్నది. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే అన్ని ఆదాయాలపై పన్ను విధించాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. అలాగే గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పన్ను పెంచాలని సూచించింది.

ప్రస్తుతం వీటిపై 18శాతం విధిస్తుండగా.. 28 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ-వాహనాల జీఎస్టీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ-వాహనాలపై జీఎస్టీని ఐదుశాతం స్లాబ్‌లో చేర్చడంతో పాటు బంగారం, విలువల రాళ్లు తరలింపు కోసం ఈ-వే బిల్‌, ఈ చలాన్‌ తీసుకురావడం, చిన్న తరహా ఈ-కామర్స్‌ కంపెనీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ నిబంధనల నుంచి మినహాయింపు, తక్కువ పన్ను రేట్ల తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/