చీరల పంపిణీలో తొక్కిసలాట నలుగురు మృతి ..ఈసారి ఎక్కడంటే

మరోసారి చీరల పంపిణీలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ మధ్యనే గుంటూరు లో టీడీపీ చేపట్టిన చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగి పలువురు మహిళల ప్రాణాలు పోగా..తాజాగా తిరుపట్టూరులోని వణియంబాడి చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందారు. థాయ్‌పూసమ్ పండుగ సందర్భంగా ఓ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అయ్యప్పన్ మహిళలకు ఉచితంగా చీరలు, పురుషులకు పంచెలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా తొలుత పంపిణీ చేసిన టోకెన్ల కోసం వేలాదిమంది ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనల నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది వరకు గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించి జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లుగా సమాచారం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తైపూసం పండగపూట నలుగురు మహిళలు మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.