హైతీ దేశాధ్య‌క్షుడి హ‌త్య‌..అనుమానితుల కాల్చివేత‌

పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ : హైతీ అధ్య‌క్షుడు జోవెనెల్ మొయిజ్‌ను త‌న అధికారిక నివాసంలోనే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. అయితే అధ్య‌క్షుడిని హ‌త్య చేసిన కేసులో అనుమానితులుగా ఉన్న న‌లుగుర్ని భ‌ద్ర‌తా ద‌ళాలు తుద‌ముట్టించిన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రో ఇద్ద‌ర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న మ‌రికొంత మంది అనుమానితులు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌రారీలో ఉన్న వారిని చంపేస్తాం లేదా ప‌ట్టుకుంటామ‌ని పోలీసు చీఫ్ లియాన్ చార్లెస్ తెలిపారు.

కాగా, హైతీ అధ్య‌క్షుడు జోవెనెల్ మొయిజ్‌(53) ను త‌న అధికారిక నివాసంలోనే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య‌ చేశారు. ఆయుధాల‌తో వ‌చ్చిన కొంద‌రు మొయిజ్‌ను కాల్చి చంపిన‌ట్లు తాత్కాలిక ప్ర‌ధాని క్లాడ్ జోసెఫ్ తెలిపారు. అధ్య‌క్షుడు మ‌ర‌ణించిన నేప‌థ్యంలో తానే దేశానికి ఇంచార్జీగా మారిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దాడిలో గాయ‌ప‌డ్డ అధ్య‌క్షుడు మొయిజ్ భార్య ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్ర‌జ‌లంతా సంయ‌మ‌నంతో ఉండాల‌ని జోసెఫ్ అభ్య‌ర్థించారు. పోలీసులు, ఆర్మీ ప్ర‌జ‌ల భ‌ద్ర‌త చూసుకుంటుంద‌న్నారు. ఇంగ్లీష్‌, స్పానిష్ భాష‌లో మాట్లాడే వ్య‌క్తులు అధ్య‌క్షుడి ఇంట్లోకి చొర‌బ‌డి హ‌త్య చేసిన‌ట్లు ప్ర‌ధాని జోసెఫ్ చెప్పారు. 2018 నుంచి ఆ దేశాధ్య‌క్షుడి మొయిజ్ కొన‌సాగుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/