3,583 నామినేషన్లు

rajath kumar
rajath kumar

నేడు ప్రభుత్వ సెలవు ఉన్నా స్క్రూట్నీ కొనసాగింపు
23 నుంచి డిసెంబర్‌ 1 వరకు ఓటరు స్లిప్పులు పంపిణీ
పోలింగ్‌ రోజు 48వేల మంది పోలీసులు: రజత్‌కుమార్‌ వెల్లడి
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలించేందుకు 22న రానున్న ఓపి రావత్‌
హైదరాబాద్‌: ఓటింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి రజత్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఖరారు చేశామని వెల్లడిం చారు. ఓటరు నమోదుకు మంచి స్పందన లభించిందని, 7లక్షల 45వేల 838 మంది కొత్త ఓటర్లు, 243 మంది ప్రవా సులు ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు.ఎన్నికల నిర్వహణ,ఏర్పాట్లపై ఆయన మంగళవారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ స్టేషన్ల పెంపునకు,మార్పునకు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 32,796 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, 9,445 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారని తెలిపారు.తాజాగా ప్రకటించిన జాబితా ఆధారంగానే డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని, బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికీ వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయాలని సూచించారు. బల్క్‌గా ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మిగిలిన ఓటరు స్లిప్పులు ఓటింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రం వద్ద పెట్టి పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటరు స్లిప్పులపై పోలింగ్‌ కేంద్రం మ్యాప్‌, వివరాలు కూడా ఉంటాయని చెప్పారు.
పోలింగ్‌ రోజు 48వేల మంది పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలనుగానూ 3,583 నామినేషన్లు దాఖలయ్యాయని రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌-300,బిజెపి-270,సిపిఎం-64,సిపిఐ-5,ఎన్‌సిపి-36,బిఎస్‌పి-182,టిఆర్‌ఎస్‌-272,టిడిపి- 52, ఎంఐఎం-21,వైఎస్సార్‌ కాంగ్రెస్‌-1 నామినేషన్‌ దరఖాస్తులు దాఖలు చేశాయి. ఇండిపెండెట్లు,ఇతరులు 2,441 మంది నామినేషన్‌ దరఖాస్తులు దాఖలు చేశారు. 20వ తేదీ నామినేషన్ల పరిశీలన జరిగిందని, 21న ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ నామినేషన్ల పరిశీలన కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు అప్‌డేట్‌ చేసిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2.80 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పోలింగ్‌ సిబ్బంది కోసం 1,60,509 మందిని గుర్తించామని,రాష్ట్ర స్థాయిలో 35వేల మంది పోలీస్‌ సిబ్బంది ఉన్నారని చెప్పారు. పోలింగ్‌ రోజు మొత్తం 48వేల మంది పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. 279 కంపెనీల కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీస్‌ బందోబస్త్‌ ఉన్నారని, చత్తీస్‌గఢ్‌,మధ్యప్రదేశ్‌ నుంచి అదనపు భద్రతా బలగాలను రప్పిస్తున్నామన్నారు. పోలింగ్‌ రోజు ఓటర్ల జాబితాను పోలింగ్‌ కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచుతామన్నారు. పంపిణీ చేయగా మిగిలిన పోలింగ్‌ స్లిప్పులను ఎన్నికల రోజు పోలింగ్‌ బూత్‌ దగ్గర ఉంచుతామన్నారు. గత ఎన్నికల తీరుకు, ప్రస్తుత ఎన్నికల తీరుకు కొంత తేడాలు ఉన్నాయన్నారు. ప్రజలకు పోలింగ్‌ తీరుపై అవగాహన కల్పించామని రజత్‌ పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సూచించారు. మేడ్చల్‌-మల్కాజగిరి జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది కొరత ఉందని, కొన్ని నియోజకవర్గాల్లో బుధవారం కూడా నామ పత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు.
3,500 ఫిర్యాదులు
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై స్పందిస్తున్నామని రజత్‌కుమార్‌ చెప్పారు. నోటీసులకు ఇచ్చే వివరణల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు సీవిజిల్‌ యాప్‌ ద్వారా 3,500 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 2,220 సరైనవిగా గుర్తించామన్నారు. ఐదు లక్షల ఓటర్‌ గుర్తింపు కార్డులు మీ సేవకు అందించామని, నెలాఖరు వరకు కొత్త ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందిస్తామని చెప్పారు. తనిఖీల్లో భాగంగా రూ.90.72 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాదీనం చేసుకున్నామని సీఈవో తెలిపారు.
సంగారెడ్డి కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
సంగారెడ్డి కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని దీనిపై నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 23వ తేదీనాడు బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌ చేపడతామన్నారు. నామినేషన్‌ వేసిన సమయం నుంచి అభ్యర్థుల ఖర్చు ఎన్నికల ఖర్చు కిందకి వస్తాయని తెలిపారు. నోటీసులు పొందిన అభ్యర్థులు వివరణ ఇచ్చారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్క మతం గురించి వైఎంసియేలో మాట్లాడారని, ఆయన కూడా వివరణ ఇచ్చారన్నారు. పోలీసులు కేసు పరిశీలన చేసి గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్‌ మీడియాపై నిఘా పెట్టామని, వాటిని పరిశీలించి పెయిడ్‌ న్యూస్‌ కింద పరిగణిస్తామన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు తగ్గుతాయన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అన్ని వాహనాలను తనిఖీ చేయవచ్చునని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ ‘ఏపి ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వద్దు, ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘణ కిందకి వస్తుంది. ఇది పెయిడ్‌ న్యూస్‌ కిందకి వస్తుంది అని చెప్పారు. ప్రగతి భవన్‌లో పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చాయని వాటిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామమని,వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తామని జాయింట్‌ సీఈవో ఆమ్రపాలి పేర్కొన్నారు. కాగా, తెలంగాణ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపి రావత్‌ ఈనెల22న హైదరాబాద్‌కు రానున్నారు.