దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు కేంద్రం సూచన

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా3,095 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక్కరోజులో మూడు వేల పైచిలుకు కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోసారి. బుధవారం కూడా మూడువేల పైచిలుకు కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతికదూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని కేంద్రం సూచించింది.

ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర వరకూ ఉన్న ఆసుపత్రులు హైఅలర్ట్‌లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్‌‌బీబీ వేరియంట్ కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, కొత్త వేరియంట్ ఏదీ వెలుగులోకి రాలేదని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధ నగర్ ఘాజియాబాద్ జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కేరళలోని ఎర్ణాకులం, తిరువనంతపురం జిల్లాలు కేసుల సంఖ్య పరంగా టాప్‌లో ఉన్నాయి. గోవాలో గురువారం కొత్తగా 108 కేసులు వెలుగులోకి వచ్చాయి.