టీకా తీసుకున్న ఆరు నెలల్లోనే తగ్గుతున్న యాంటీబాడీలు.. ఏఐజీ అధ్యయనం

1636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఏఐజీ అధ్యయనం
ఐజీజీ-ఎస్1, ఐజీజీ-ఎస్2 యాంటీబాడీల్లో తగ్గుదల

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతిరోధకాలు (యాంటీబాడీలు) పెరిగి వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త అయినా చెప్పేది ఇదే. అయితే, టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. టీకా తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు గుర్తించారు. ఐజీజీ యాంటీ-ఎస్1, ఐజీజీ యాంటీ-ఎస్2 ప్రతిరోధకాల్లో వచ్చిన గణనీయమైన మార్పును గుర్తించారు. 40 ఏళ్లు దాటి డయాబెటిస్, బీపీ వంటి సమస్యలతో బాధపడున్న వారిలో ఈ తగ్గుదల ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఐజీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేవాయి.

ఈ అధ్యయనంలో పాల్గొన్న 1636 మంది ఆరోగ్య కార్యకర్తలను మూడు బృందాలుగా విభజించారు. వారిలో 93 శాతం మందికి కొవిషీల్డ్, 6.2 శాతం మందికి కొవాగ్జిన్, ఒక శాతం మందికి స్పుత్నిక్ టీకాలు ఇచ్చారు. ఆరు నెలల తర్వాత వీరిని పరిశీలించగా ఐజీజీ-ఎస్1, ఐజీజీ-ఎస్2 యాంటీబాడీలు తగ్గినట్టు గుర్తించారు. 30 శాతం మంది ఆరోగ్య కార్యకర్తల్లో 100 ఏయూ/ఎంఎల్ కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. అంటే, వీరికి వైరస్ ముప్పు పొంచి ఉన్నట్టేనన్నమాట. అంతేకాదు, వీరంతా 40 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. అనుబంధ రోగాలు ఉన్న వారు రెండు డోసులు తీసుకున్నా ఆరు నెలల తర్వాత యాంటీబాడీల్లో తగ్గుదల కనిపిస్తోందని చెప్పడానికి ఈ అధ్యయనం నిదర్శనమని ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. కాబట్టి ఇలాంటి వారు ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదని చెప్పారు. అయితే, మిగతావారు కూడా 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని వివరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/