డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి

నిన్న సికింద్రాబాద్ లోని నల్లగుట్ట డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షో రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం ఈ షో రూమ్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దాదాపు 24 గంటల పాటు అగ్ని మాపక సిబ్బంది 200 ఫైర్ ఇంజన్ల తో శ్రమిస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అగ్నిప్రమాదంలో నిన్నటి నుంచి ఆచూకీ లభించని ముగ్గురు సజీవదహనం అయ్యారు.

మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా బూడిదయ్యాయి. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దంతాలు తప్ప మరేమి దొరికే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రమాదంలో వసీం, జునైద్‌, జహీర్ మిస్ అయ్యారు. మృతులు బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు అధికారులు. అలాగే ఫైర్ సిబ్బంది లోని ఓ వ్యక్తి కూడా పొగ తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఈయన్ను ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈయన పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగానే ఉందని అంటున్నారు. మరోవైపు పోలీస్ అధికారులు ప్రమాదం నుంచి బయటపడ్డ కూలీలను విచారణకు పిలిచారు.