మూడు నెలలు ఇంటి అద్దె వసూలు చేయరాదు: ప్రభుత్వం

బకాయిలపై వడ్డీలేని వాయిదాల్లో వసూలు చేసుకోవాలి.. ప్రభుత్వం ఆదేశాలు

house
house

హైదరాబాద్‌: తెలంగాణ లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో అద్దెకుంటున్న వారి నుంచి యజమానులు కిరాయి వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి నుంచి 3 నెలల పాటు అద్దె అడగొద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండేలా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని తెలిపింది. అయితే అద్దెలు చెల్లించలేదన్న కారణంతో ఎవరినీ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించరాదని తెలిపింది. ఇల్లు ఖాళీ చేయిస్తే వారు సరిహద్దులు దాటడం లేదా మరో ఊరికి వెళ్తారని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. 3 నెలల తర్వాత అద్దె బకాయిలను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని సూచించింది. బలవంతంగా అద్దెలు వసూలు చేసినట్లు, ఇల్లు ఖాళీ చేయించినట్లు ఫిర్యాదులొస్తే ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్టు1897, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్టు2005 ప్రకారం శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలు, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/