ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు

మూడు చైనీస్ తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం


శ్రీనగర్ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో నిన్న వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఇటీవల నాన్ లోకల్ కార్మికులను చంపడం, వివిధ ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి అలజడి సృష్టించడం వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందనే విషయం విచారణలో తేలిందని చెప్పారు. వీటికి సంబంధించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పండ్ల తోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పక్కా ప్రణాళికతో వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

వీరి వద్ద నుంచి మూడు చైనీస్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గందేర్ బల్ ప్రాంతంలో కూడా ఒక స్కార్పియో వాహనంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాథీనం చేసుకున్నామని తెలిపారు. లష్కరే తోయిబా మద్దతుదారుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో కీలక సమాచారం లభించే అవకాశం ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/