పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు..మూడు మృతదేహాలు లభ్యం

పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యంకాగా..మరో నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సరదాగా బీచ్ కు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన ఘటన అనకాపల్లి జిల్లాలోని పూడిమడక సముద్ర తీరంలో శుక్రవారం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో కాసేపు సేద తీరారు. కేరింతలు కొడుతూ కోలాహలం చేశారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితులను ఒక్కసారిగా సముద్రం తన ఒడిలోకి లాక్కెళ్లింది.

కళ్లముందే తమ ప్రాణ స్నేహితులు అలల తాకిడికి కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక.. కాపాడలేక మిగతా వాళ్లంతా గుండెలవిసేలా రోదించారు. గల్లంతైనవారిని జిల్లాలోని ఓ ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం 15 మంది విద్యార్థులు బీచ్‌కు వెళ్లగా.. ఏడుగురు గల్లంతుకాగా.. మిగతా 8 మంది క్షేమంగా బయటపడ్డారు. నేవీ హెలికాప్టర్ సాయంతో మూడు మృతదేహాలను ఒడ్డుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. గల్లంతైన మిగతా నలుగురి విద్యార్థుల కోసం నేవీ, కోస్ట్‌గార్డ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇటు బోట్లు, అటు హెలికాప్టర్లలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు తమ పిల్లల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు సముద్ర తీరంలో ఎదురుచూస్తున్నారు.