విశాఖపట్నంలో విషాదం : కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి

విశాఖపట్నంలో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగి పేటలో పాత మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వెంటనే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని బీహర్ కు చెందిన చోటు, సాకేటి అంజలి, సాకేటి దుర్గ ప్రసాద్‌గా గుర్తించారు. వీరిలో అంజలి పదోతరగతి చదువుతోంది. ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు.

ఇక గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే విజయవాడకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ నూడిల్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.