3 రాజధానుల బిల్లు తాత్కాలిక రద్దు: సీఎం జగన్

మెరుగైన బిల్లులతో మరోసారి సభలోకి ప్రవేశ పెడతాం

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

Amaravati: 3 రాజధానులు రద్దు బిల్లుపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 3 రాజధానుల చట్టం తో పాటు సిఆర్డేఏ చట్టాన్ని రద్దు చేస్తునట్టు ప్రకటించారు. న్యాయపరంగా మెరుగైన బిల్లులతో మళ్ళీ సభ ముందుకు వస్తుందని వెల్లడించారు. సమూలమైన మార్పులతో మరోసారి ప్రజా ఆమోదంతో సమగ్రమైన బిల్లు ప్రవేశపెట్ట నున్నామని అన్నారు. అయితే 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినప్పుడు రాజధానిగా కర్నూలు ఉండేదని సీఎం అన్నారు. గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. అమరావతి ప్రాంతంలోనే నా ఇల్లు ఉందన్నారు. ఈ ప్రాంతమంటే తనకు ఇష్టమన్న సీఎం జగన్.. అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కనీసం రోడ్లు వేసుకోవడానికే డబ్బులు లేనిస్థితిలో ఇలాంటి ఊహా చిత్రం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం మన పిల్లలు పెద్ద నగరాలకు వలస వెళ్లాల్సిందేనా? అని అడిగారు.

రాష్ట్రంలో విశాఖ పెద్ద నగరం అని అన్నారు. విశాఖను అభివృద్ధి చేస్తే పదేళ్లకు హైదరాబాద్ తో పోటీ పడుతుందనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా పెట్టాలనుకున్నామని సీఎం వివరించారు. వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలకు మంచి చేయాలనే అడుగులు వేశామన్నారు. ఈ ఆలోచన చేసిన రెండేళ్ల నుంచి రకరకాల అపోహలు సృష్టించారని సీఎం మండిపడ్డారు. న్యాయపరమైన చిక్కులు సృష్టించారని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే వికేంద్రీకరణ బిల్లును పెట్టినట్లు చెప్పారు. మరోసారి హైదరాబాద్ వంటి సూపర్ కేపిటల్ వద్దని ప్రజల తీర్పు స్పష్టం చేసిందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ఆవిష్కరించిందని ప్రతి ఎన్నికల్లో దీవించారని పేర్కొన్నారు. మళ్లీ సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో వస్తామని సీం స్పష్టం చేశారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/