వందే భారత్ రైలు ఫై రాళ్ల దాడి కేసులో ముగ్గురి అరెస్ట్


రెండు రోజుల క్రితం వైజాగ్ లో వందే భారత్ రైలు ఫై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాళ్ల దాడి తర్వాత గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆ ముగ్గురినీ వెంబడించగా.. వారిలో శంకర్‌ చెప్పును వదిలేసి పారిపోయాడు. నగర సీపీ కూడా రైల్వే పోలీసులకు సహకరించాలని కోరారు. దీంతో వెస్ట్‌ ఏసీపీ, కంచరపాలెం సీఐ, టాస్క్‌ఫోర్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. చివరికి సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులు ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ పాత కేసుల్లో నిందితులని తేల్చారు. చందు, దిలీప్, శంకర్ అనే వ్యక్తులే దాడికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు పగిలిన అద్దాల స్థానంలో రైల్వే సిబ్బంది కొత్త అద్దాలు అమర్చారు.

ఇక సంక్రాంతి నాడు ఈ నెల15న ప్రధాని మోడీ వందేభారత్ ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వందేభారత్ రైలు ఇప్పటికే సికింద్రబాద్ చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన వందేభారత్ విశాఖ – సికింద్రాబాద్ మధ్య ట్రెయిల్ రన్ పూర్తి చేసారు. ఈ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే నడవనుంది. రైలు షెడ్యూల్ ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో మాత్రమే నిలుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి రాజమండ్రి 7.55/7.57కు, విజయవాడ 10/10.05, ఖమ్మం 11/11.01, వరంగల్‌కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్‌ 14.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 15.00గంటలకు బయలుదేరి వరంగల్‌ సాయంత్రం 16.35/16.36 గంటలకు, ఖమ్మం 17.45/17.46, విజయవాడ 19.00/19.05, రాజమండ్రి 20.58/21.00, విశాఖపట్నం రాత్రి 23.30 గంటలకు చేరుతుంది.