ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక..

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు పడుతుండడం తో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరదనీరు గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
నదీ పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేయ ఉద్ధృతికి లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తు బృందాలను ఎక్కడికక్కడ మోహరించాలని ఆదేశించారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముమ్మిడివరం పరిధిలోని లంకా ఆఫ్ ఠాన్నే లంక, పల్లం వారిపాలెం గ్రామాల్లో మెట్ట పంటలు నీటి మునిగాయి. మునగ, గోంగూర, బీర, అరటి తోటలు ముంపు బారిన పడ్డాయి. కొబ్బరి తోటలోని కాయలు కొట్టుకుపోకుండా రైతులు గట్టుకు చేరుస్తున్నారు. ఐ.పోలవరం మండలం ఎదురులంకలో వరదకు కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి. మరోపక్క బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.