ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం..26 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: యూపీలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. సుల్తాన్‌పూర్ వ‌ద్ద ఓ మినీ బ‌స్సు.. మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 26 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితులంతా ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌వారిగా యూపీ పోలీసులు గుర్తించారు.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బ‌స్సులో అయోధ్య‌, కాశీ సంద‌ర్శ‌న‌కు ఈ నెల 10న వెళ్లారు. అయోధ్య సంద‌ర్శ‌న అనంత‌రం తిరిగి వ‌స్తుండ‌గా.. నిన్న ఉద‌యం 3:30 గంట‌ల‌కు ల‌క్నో, వార‌ణాసి జాతీయ ర‌హ‌దారిపై మినీ బ‌స్సు.. మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న‌ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో మినీ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న 26 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రులు లంబువా క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు. బ‌స్సు డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తులో ఉండ‌టం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు యూపీ పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. బాధితుల్లో ఎక్కువ మంది 60, 70 ఏండ్ల వ‌య‌సున్న వారే ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/